Shubman Gill : టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు (754) చేసిన ఆటగాడిగా నిలిచిన గిల్, ఇప్పుడు మరో అరుదైన రికార్డు సృష్టించారు. ఇటీవల ఒక ఛారిటీ వేలంలో, శుభ్‌మన్ గిల్ టెస్ట్ జెర్సీకి అత్యధిక ధర పలికింది. ఇంగ్లాండ్, భారత్ జట్ల ఆటగాళ్ల జెర్సీలపై వేలం నిర్వహించగా, గిల్ జెర్సీ అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. శుభ్‌మన్ గిల్ టెస్ట్ జెర్సీ రూ.5.41 లక్షల భారీ ధరకు అమ్ముడుపోయింది. ఈ ఆన్‌లైన్ ఛారిటీ ఈవెంట్ జూలై 10 నుంచి జూలై 27 వరకు జరిగింది. ఈ వేలం ద్వారా సేకరించిన మొత్తం డబ్బును రూత్ స్ట్రాస్ ఫౌండేషన్కు విరాళంగా ఇస్తారు.
ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్, తన భార్య రూత్ స్ట్రాస్ క్యాన్సర్‌తో 2018లో మరణించిన తర్వాత ఈ ఫౌండేషన్‌ను స్థాపించారు. దీర్ఘకాలిక, నయం కాని వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడమే ఈ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. ఇలాంటి గొప్ప కారణం కోసమే గిల్ జెర్సీకి రికార్డు ధర పలికింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. నంబర్ 4లో బ్యాటింగ్ చేస్తూ 75.40 సగటుతో 754 పరుగులు సాధించాడు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత, ఒక ఛారిటీ ఆక్షన్‌లో అతని జెర్సీ అత్యధిక ధరకు అమ్ముడైంది.
Shubman Gill’s test jersey got the top amount across teams for the charity pic.twitter.com/pKS6yR3AGs
— Nikhil-Gill77 🚩 🕉️🕉️ (@nikhil_balaka) August 9, 2025
శుభ్‌మన్ గిల్ తర్వాత, టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జెర్సీకి రెండో అత్యధిక ధర పలికింది. బుమ్రా జెర్సీ రూ.4.94 లక్షలకు అమ్ముడుపోయింది. అదే ధరకు రవీంద్ర జడేజా జెర్సీ కూడా అమ్ముడుపోయింది. కేఎల్ రాహుల్ జెర్సీ రూ.4.71 లక్షలకు వేలంలో అమ్ముడవగా, ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ జెర్సీకి రూ.4.47 లక్షలు పలికింది. ఈ విధంగా భారత ఆటగాళ్ల జెర్సీలకు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….