సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారత హైకమీషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ కు చెందిన కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వంలో, పారిశ్రామిక వేత్తల్లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని భారత హై కమిషనర్ ముఖ్యమంత్రికి తెలిపారు. వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, ఆ దేశంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్‌లో భారతీయుల కార్యకలాపాల గురించి భారత హై కమిషనర్ సీఎంకు వివరించారు.
ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమి కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలపై తెలియజేశారు. భారత్‌తో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని శిల్పక్ అంబులే వివరించారు. భారత్‌లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హైకమిషనర్ ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ గతంలో సింగపూర్‌తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని.. కొన్ని కారణాల వల్ల రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగిందని అన్నారు. 2019-24 మధ్య జరిగిన పరిణామాలు దీనికి కారణమయ్యాయన్నారు. ప్రస్తుతం తన పర్యటనలో గతంలో జరిగిన అపోహల్ని తొలగించి రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అలాగే ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలను, అవకాశాలను భారత హై కమిషనర్‌కు సీఎం వివరించారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఇప్పటికే విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలోనూ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయని సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా అమరావతిలో తొలి క్యాంటం వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలియజేశారు. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకించి రాయలసీమలో డిఫెన్సు, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. సింగపూర్ నుంచి భారత్‌కు పెట్టుబడులు రావాలని దీనికి ఏపీ గేట్ వేగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు.
ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. మరోవైపు సింగపూర్‌లో 83 శాతం మేర పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని భారత హై కమిషనర్ వివరించారు. దీనిపై ఏపీలో చేపడుతున్న హౌసింగ్ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు. అలాగే విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ఆలోచనల్ని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భారత హై కమిషనర్‌కు వివరించారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటు అవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి తెలిపిన మంత్రి ఏపీకి త్వరలో తరలివచ్చే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఏపీ టెక్ నిపుణులకు ప్రత్యేక డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెక్ నిపుణులకు ఆగ్నేయాసియాలో ప్రత్యేకించి సింగపూర్‌లో డిమాండ్ ఉందని భారత హై కమిషనర్ సీఎంకు వివరించారు. అమెరికా తరహాలోనే ఆగ్నేసియాలోని సింగపూర్ లాంటి దేశాల విద్యార్ధుల్ని, టెక్ నిపుణుల్ని ఆకర్షిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ అంశంపై సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ముఖ్యమంత్రికి తెలియచేశారు. సింగపూర్ నుంచి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ఆయన వివరించారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల ఉత్పత్తి, షిప్ బిల్డింగ్, పోర్టు కార్యకలాపాల నిర్వహణ, డేటా సెంటర్ల ఏర్పాటు, ఫార్మా తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని సీఎంకు వివరించారు. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా పసిఫిక్ దిగ్గజ కంపెనీలు ఎస్టీటీ, కెప్పెల్, కాపిటాల్యాండ్, ఈక్వినిక్స్, పీఎస్ఏ తదితర సంస్థల విస్తరణకు అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. ఏఐ, స్టార్టప్‌లు, వైద్య పరికరాల రంగంలో పరిశోధన, ఏపీ, సింగపూర్ యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యం కుదుర్చుకునే అంశంపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ సహా ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు