హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన పదో తరగతి హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ కృష్ణా రావు సూచించారు. అలాగే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నుంచి కూడా విద్యార్ధులు హాల్ టికెట్లను పొందొచ్చని పేర్కొన్నారు. ఒక వేళ ఏదైనా కారణాలతో పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షలు రాయవచ్చని పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు, సందేహాలుంటే 040-23230942 అనే ఫోన్ నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని, అందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు.
కాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11,544 పాఠశాలలు ఉండగా.. వీటిల్లో దాదాపు 4.97 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు చదువుతున్న పాఠశాలలకు సమీపంలోనే పరీక్ష కేంద్రాలుంటాయని, కంగారు పడాల్సిన అవసరం లేదని కృష్ణారావు చెప్పారు. కాగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2025 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్‌తో సత్ఫలితాలు.. ఇంటర్ బోర్డు
తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లపై తొలిసారిగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానం సత్ఫలితాలు ఇస్తోందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాన్ని సులభంగా గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పరీక్ష కేంద్రం చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ట్రాఫిక్ ఎంతమేర ఉందో ముందుగానే తెలుసుకునే అవకాశం దొరకుతుందని వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీల్లోని విద్యార్థులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా మారిందని పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.