కొందరికి చదవు అంటే ప్రాణం. పేదరికం అడ్డొచ్చినా.. కష్టాలను అధిగమించి మరీ ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అనుకున్న లక్ష్యానికి పేదరికం అడ్డుకాదని ఎంతో మంది నిరూపించారు. మరికొంత మంది పేదరికంతో చదవును మధ్యలోనే ఆపేసిన ఘటనలు లేకపోలేదు. చదవుకోసం ఓ బాలిక ఏకంగా ప్రాణాలే తీసుకుంది. తల్లిదండ్రులు ఉన్నత చదువులు వద్దు అన్నారని మనస్థాపం చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది.
మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ సులేమాన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిది నిరుపేద కుటుంబం. కూలీ పనికి వెళ్తే కానీ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి. దీంతో పిల్లలను స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఇదే క్రమంలో సులేమాన్ రెండవ కూతురు మహమ్మద్ మదిహ(15) 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యింది. ఆమెకు కామారెడ్డిలోని మైనార్టీ కాలేజీలో ఇంటర్మీడియట్ సీట్ లభించింది. కానీ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో తల్లిదండ్రులు ఇంటర్ వద్దన్నారు. బిడ్డ చదువుకుంటానని మొండికేయగా.. ఎన్నోసార్లు నచ్చ చెప్పారు. కానీ మదిహకు చదవు అంటే ప్రాణం. ఆ చదువునే తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బిడ్డ మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..