
ఆ ప్రాంతంలో రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. పశువులను బటయకు తీసుకెళ్లి మేపాలంటే భయపడి వాటిని ఇంటి వద్దనే కట్టేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వీళ్లు ఇంతలా భయపడుతుంది చిరుత పులల సంచారంతో.. గత కొన్ని రోజులుగా మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత పులుల సంచారం హడలెత్తిస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రానికి సమీపంలో గుట్టలో చిరుత పులి సంచారం భయాందోళనకు గురిచేస్తుండగా తాజాగా కోయిలకొండ మండలం కొత్లాబాద్ శివారులో గొర్రెల మంద, మనుషులపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
తాజాగా జరిగిన చిరుతపులి దాడిలో ఒక గొర్రెల కాపరితో పాటు మరో ఇద్దరు రైతులకు గాయాలు అయ్యాయి. అంతేకాకుండా ఈ క్రూరమృగం దాడిలో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు గాయపడిన రైతులను స్థానిక హాస్పిటల్‌కు తరలిచారు. ఆ తర్వాత అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు చిరుత దాడి సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. చిరుత పాదముద్రల ఆధారంగా అది సంచరించిన ప్రాంతాలను గమనించి.. దాన్ని బంధించేందుకు బోన్‌లు ఏర్పాటు చేశారు. అయితే చిరుత సంచారంతో స్థానిక జనాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా చిరుతను పట్టుకొని తమను రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.