భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు సంభవించిన నేపథ్యంలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. దమ్మపేట–అశ్వారావుపేట మండలాల సరిహద్దులోని ఆయిల్ ఫామ్ తోటలో దాచి ఉంచిన 100 కిలోల గంజాయి ప్యాకెట్లు వరదనీటిలో బయటపడిన ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల తోటలో భూమిలో దాచిన గంజాయి ప్యాకెట్లపై వేసిన చెత్త, మట్టి వర్షపు ప్రవాహంతో కొట్టుకుపోయాయి. దీంతో ప్యాకెట్లు పూర్తిగా బయటపడిపోయి వరద నీటిలో కొట్టుకొచ్చాయి. వాటిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం 44 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్యాకెట్ దాదాపు 2.25 కిలోల చొప్పున ఉండగా, మొత్తం దాదాపు 100 కిలోల గంజాయిగా అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో రూ. 50 లక్షల పైమాటే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తరలించారు? ఎవరు దాచారు? ఎక్కడికి తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు? ఆయిల్ ఫామ్‌కు గంజాయి ఎలా వచ్చింది? వంటి అంశాలపై పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.