హైదరాబాద్, మే 8: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే12న నిర్వహించనున్న టీజీ ఈసెట్ 2025 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి చంద్రశేఖర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరం బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది కూడా ఈసెట్ పరీక్షను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అర్హులైన అభ్యర్థులకు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 19,672 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్ ప్రొఫెసర్ పి చంద్రశేఖర్ తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 86 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షా కేంద్రాన్ని ముందస్తుగా సందర్శించి చెక్ చేసుకోవాలని సూచించారు. మే 12ప ఈ పరీక్షను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.
జూన్ 23 నుంచి AP PECET 2025 ఆన్‌లైన్ రాత పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాయామ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీపీఈ సెట్ 2025 పరీక్షను జూన్ 23 నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పాల్‌కుమార్ చెప్పారు. జూన్ 7తో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు గడువు ముగుస్తుందనీ, రూ.1000 ఆలస్య రుసుంతో జూన్ 11 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుంతో జూన్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. జూన్ 12 నుంచి 14 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించామని తెలిపారు. జూన్ 17 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.