శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం 2 వ్యయం 14
రాజపూజ్యాలు 5 అవమానాలు 7
ఈ రాశికి ఉగాది నుంచి ఏలిన్నాటి శని ప్రారంభమవుతోంది. దీని వల్ల ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ తిప్పట, శ్రమ, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఏ వ్యవహారమూ ఒక పట్టాన పూర్తి కాదు. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. ఆర్థిక, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ముందు జాగ్రత్త చర్యలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఇంట్లో అంచనాలకు మించిన ఖర్చుతో శుభ కార్యాలు జరుగుతాయి. విదేశాల్లో లేదా దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా మందగిస్తాయి. ఒక్కొక్కసారి శ్రమకు తగ్గ ప్రయోజనాలు లేకపోయినా నిరుత్సాహపడకుండా పట్టుదల చూపించాల్సిన అవసరం ఉంటుంది.
మార్చి 29 నుంచి ఒకటి రెండు రోజుల పాటు వ్యయ స్థానంలో పంచ గ్రహ కూటమి ఏర్పడుతున్నందువల్ల అది మీ మనస్సు మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కొన్ని సమస్యల విషయంలో చిక్కుముడులు ఏర్పడతాయి. అవకాశాలను జారవిడుచుకునే అవకాశం ఉంది. మే 25న గురువు తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ప్రయత్నపూర్వక ధన లాభం ఉంటుంది. ఆదాయ వృద్ధికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి.
మే 18న లాభ స్థానంలోకి రాహువు ప్రవేశం వల్ల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త సంవత్సరం పూర్వార్థం నుంచి ఆర్థిక, అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు అందుతాయి. ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఒక్క శని తప్ప మిగిలిన గ్రహాలన్నీ సానుకూలంగా ఉండబోతున్నందువల్ల అక్టోబర్ నుంచి అనుకూలతలు బాగా పెరుగుతాయి. నష్టదాయక వ్యవహారాలను దూరం పెట్టి, లాభ దాయక వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం ఎక్కువవుతుంది. అయితే, విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితం ఉండకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తరచూ శివార్చన చేయించడం లేదా నవ గ్రహాలకు తరచూ ప్రదక్షిణలు చేయడం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గుతుంది.