ప్రస్తుత కాలంలో మోమోస్ ఎంతగా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్ట్రీట్ ఫుడ్‌లో ఇప్పుడు ఇవి కూడా చేరిపోయాయి. అందరూ వీటిని లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. వెజ్ మోమోస్‌ని అమ్మి చాలా మంది ఎంతో డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఈ వెజ్ మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ అయ్యి.. పలువురు మరణించిన వార్తలు కూడా వినే ఉంటారు. బయట ఫుడ్ ఎప్పుడైనా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇంట్లో తయారు చేసినంత శుభ్రంగా బయట తయారు చేయరు. వాళ్లు ఉపయోగించే పదార్థాలు కూడా నాశిరకమైనవి ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఎంతో మందికి ఫేవరేట్ ఫుడ్ అయినా వెజ్ మోమోస్‌ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ వెజ్ మోమోస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం.
వెజ్ మోమోస్‌కి కావాల్సిన పదార్థాలు:
మైదా పిండి, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, పన్నీర్ తురుము, మిరియాల పొడి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, తెల్ల మిరియాల పొడి, సోయాసస్, ఉప్పు, ఆయిల్.
వెజ్ మోమోస్ తయారీ విధానం:
ఈ వెజ్ మోమోస్‌ని ఎంతో ఈజీగా తయారు చేయవచ్చు. ఒక గిన్నెలోకి కొద్దిగా మైదా పిండి తీసుకోండి. ఇందులో నీళ్లు పోసి మెత్తగా అయ్యేలా కలిపి.. ఓ పావు గంట సేపు పక్కన పెట్టండి. ఇప్పుడు కూరగాయల్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా బటర్, ఆయిల్ వేయాలి. ఇందులో కూరగాయల ముక్కలు వేసి.. ఓ పదినిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, తెల్ల మిరియాల పొడి, మిరియాల పొడి, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు, సోయా సాస్ వేసి అన్నీ కలపాలి. ఇప్పుడు మైదా పిండి తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. వీటిని ఇప్పుడు చిన్న ఉండలుగా చేసి.. చిన్న పూరీలా చేసుకుని అందులో వెజిటేబుల్ స్టవ్ ఉంచి.. మోమోస్ షేపులో చుట్టుకోవాలి.
ఈ మోమోస్‌ని చాలా రకాల షేపుల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ గిన్నె తీసుకుని.. అందులో గ్లాసు నీళ్లు వేసి మరిగించాలి. ఆ తర్వాత ఒక ఇడ్లీ రేకు తీసుకుని దానికి ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు మోమోస్‌ని అన్నీ ఉంచి.. మీడియం మంట మీద ఓ పావు గంట సేపు ఉడికించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వెజ్ మోమోస్ సిద్ధం. వీటిని టమాటా సాస్ లేదా మోమోస్ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.