Vijay: ‘దేవుడు లేడన్న పెరియార్‌ మాటలకు మేం వ్యతిరేకం’.. తొలి బహిరంగ సభలో విజయ్ కామెంట్స్

Vijay: ‘దేవుడు లేడన్న పెరియార్‌ మాటలకు మేం వ్యతిరేకం’.. తొలి బహిరంగ సభలో విజయ్ కామెంట్స్


తమిళగ వెట్రిక్‌ కళగం పార్టీ పేరుతో పొలిటికల్‌ అరంగేట్రం చేస్తున్నారు..తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్‌. ఇప్పటికే పార్టీ పేరు, జెండా ప్రకటించిన విజయ్..తొలి బహిరంగ సభను గ్రాండ్‌గా నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురం వేదికగా జరిగిన సభకు..లక్షల సంఖ్యల అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ముందుగానే ప్రకటించినప్పటికీ..అభిమానాలు మాత్రం ఉదయం నుండి సభా ప్రాంగణానికి వేలాదిగా తరలివచ్చారు.

అన్నట్టుగానే సాయంత్రం నాలుగు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు విజయ్. 800 మీటర్ల పొడవైన ర్యాంప్‌పై సింగిల్‌గా వాక్‌ చేస్తూ..అభిమానులకు అభివాదం చేశారు. అభిమానులు స్టేజ్ మీదకు విసిరిన కండువాలను తన భుజాన వేసుకుని వారిని ఆనంద పర్చారు..ఇళయ దళపతి.

మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు

మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటినుంచే పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మహానాడు పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. పార్టీ ఏర్పాటు చేసిన ఉద్దేశంతో పాటు తన పార్టీ సిద్ధాంతాలు, వచ్చే ఎన్నికల్లో తన అజెండాపై ఈ మహానాడు వేదికపైనుండి ప్రజలకు స్పష్టత ఇచ్చారు విజయ్.

తమిళనాడు రాజకీయాల్లో తాను ఎవరికీ A టీమ్‌గానీ..B టీమ్‌గానీ కాదని స్పష్టం చేశారు..విజయ్‌. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ చేస్తుందన్నారు. సిద్ధాంతపరంగా బీజేపీని..రాజకీయంగా డీఎంకేని వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. ఇక్కడ కొంతమంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పాట పాడుతూ..ఆ రంగులు వేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అండర్‌గ్రౌండ్‌ డీలింగ్‌ చేసుకుంటూ..ద్రావిడ మోడల్‌ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

తొలి బహిరంగ సభలో V సెంటిమెంట్‌

టీవీకే తొలి బహిరంగ సభలో..విజయ్‌ అండ్‌ V సెంటిమెంట్‌ కొట్టొచ్చినట్లు కనిపించింది. పార్టీ పేరు తమిళగ వెట్రిక్‌ కళగం. టీవీకే వ్యవస్థాపకుడి పేరు విజయ్. పార్టీ పేరులోని వెట్రిక్ అనేది Vతో ప్రారంభం అవుతుంది. మహానాడు సభ నిర్వహణ విల్లుపురం జిల్లా కేంద్రంలో జరిగింది. అది కూడా V అక్షరంతో మొదలవుతుంది. ఇక విక్రవాండి ప్రాంతంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా V అనే అక్షరంతోనే ప్రారంభమవుతుంది. సభ జరిగే ప్రాంతం V జంక్షన్‌ కావడం మరో విశేషం. V ఫర్‌ విక్టరీ అంటూ విజయ్‌ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. (Spot)

మంచి ప్రభుత్వం, పాలనకు సూచికగా కామరాజ్‌ నాడార్‌

సభా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కటౌట్ల ద్వారా కూడా తన పార్టీ విధానాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు విజయ్. మంచి ప్రభుత్వాన్ని, పరిపాలనను అందిస్తామంటూ కామరాజ్‌ నాడార్‌ కటౌట్‌ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక తమిళనాడులో ద్రవిడ పార్టీల మూల సిద్ధాంతకర్త పెరియార్‌ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆయన కటౌట్‌ పెట్టడం ద్వారా చెప్పకనే చెప్పారు. ఇక అంబేద్కర్ చూపిన రాజ్యాంగం బాటలో నడుచుకుంటామని చెప్పడానికి ఆయన కటౌట్‌ను ఏర్పాటు చేశారని భావిస్తున్నారు..పొలిటికల్‌ అనలిస్ట్‌లు.

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను దళపతిగా పిల్చుకుంటారు అభిమానులు. విజయ్‌ను ఇళయ దళపతి అంటే..యువ దళపతి అని పిల్చుకుంటారు. యూత్‌లో ఆ రేంజ్‌లో పాపులారిటీని సంపాదించుకున్నారు హీరో విజయ్. విజిల్, మెర్సల్ లాంటి సినిమాలతో యువ ఆడియన్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా మారారు. వందల కోట్ల రెమ్యునరేషన్‌ని, లావిష్ లైఫ్‌ స్టయిల్‌ను వద్దనుకుని, ప్రజాజీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు విజయ్‌.

విజయ్‌కీ, ఉదయ్‌కీ మధ్యనే పొలిటికల్‌ వార్‌జోన్

వచ్చే ఎన్నికల్లో విజయ్‌కి పోటీ ఇచ్చేది ఎవరు అంటే..డీఎంకె అధినేత స్టాలిన్‌ తనయుడు ఉదయానిధి స్టాలిన్‌ అని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే పార్టీలోనూ, పార్టీ బైటా యూత్ ఐకాన్‌గా చెలామణీ అవుతున్న ఉదయనిధి..ఇటీవల ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. దీంతో మిగతా ఈక్వేషన్స్ ఎలా ఉన్నప్పటికీ.. తమిళనాట నెక్ట్స్ జెన్ పాలిటిక్స్‌లో విజయ్‌కీ, ఉదయ్‌కీ మధ్యనే వార్‌జోన్ క్రియేట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

తమిళ రాజకీయాల్లో గట్టిగా సినిమా ఇంపాక్ట్

తమిళనాడులో సినిమాలను రాజకీయాలను వేర్వేరుగా చూడలేం. తమిళనాట గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత.. అందరూ సినీ రంగం నుంచి వచ్చిన వారే. అలాగని.. సినిమా వాళ్లంతా పాలిటిక్స్‌లో సక్సెస్ అవుతారనే సిద్ధాంతం లేదు కూడా. శివాజీ గణేషన్‌, విజయ్ కాంత్‌, శరత్‌ కుమార్‌ తమిళనాడు ప్రజా జీవితంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ లాంటి వాళ్లైతే రాజకీయాల్లోకి రావాలా వద్దా అని దశాబ్దాల తరబడి డైలమాలో ఉండి.. చివరాఖరుకు వెనకడుగు వేశారు. లోకనాయకుడు కమల్‌హాసన్ కూడా రాజకీయాల్లో ఇంకా సక్సెస్‌ కాలేదు. మరి విజయ్‌ ఎంతవరకూ సక్సెస్‌ అవుతారో తెలుసుకోవాలంటే..2026 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగాల్సిందే. ఏదేమైనా.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రం తమిళనాడులో ట్రెండ్‌ సృష్టిస్తాయనడంలో సందేహం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *