
సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఓ మహిళ పొలంలో కూరగాయలు సాగు చేస్తుండగా.. తన వజ్రపు ఉంగరాన్ని పోగొట్టుకుంది. అయితే పోగొట్టుకున్న విషయాన్ని దశాబ్దకాలం పాటు కొడుక్కి తప్ప ఎవరికి తెలియకుండా దాచిపెట్టింది. ఇక ఆ తర్వాత సీన్ చూస్తే.. మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.. ఈ స్టోరీ పాతదే అయినప్పటికీ.. ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. చెక్ చేసేయండి.
వివరాల్లోకి వెళ్తే.. ఒక కెనడియన్ మహిళ 13 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న తన వజ్రపు ఉంగరాన్ని తిరిగి పొందింది. పొలంలో దుంపలను తీస్తుండగా.. ఓ క్యారెట్ ఆమెకు విచిత్రంగా కనిపించింది. అదేంటని చూడగా దెబ్బకు షాక్ అయ్యింది. 2004లో ఆల్బెర్టాలోని కుటుంబ పొలంలో కలుపు తీస్తుండగా 84 ఏళ్ల మేరీ గ్రామ్స్ అనే మహిళ తన ఉంగరాన్ని పోగొట్టుకుంది. అయితే ఆమె తన ఉంగరాన్ని పోగొట్టుకున్న విషయం సుమారు దశాబ్దకాలం పాటు కొడుక్కి తప్ప.. అందరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచింది. బయట నుంచి అదే నమూనాతో ఓ తక్కువ ధర కలిగిన ఉంగరాన్ని కొనుగోలు చేసి.. తన వేలికి పెట్టుకుంది.
ఇదిలా ఉంటే.. 13 ఏళ్ల తర్వాత మేరీ కోడలు పొలంలో క్యారెటు దుంపలు తీస్తుండగా.. ఆమెకు ఓ క్యారెటు విచిత్రంగా కనిపించింది. ఆ క్యారెట్ వజ్రపు ఉంగరం గుండా పెరిగింది. మేరీకి క్యారెట్ సూప్ ఇచ్చేందుకు ఆమె కోడలు పొలంలో క్యారెట్ దుంపలు తీస్తుండగా.. ఈ విచిత్రమైన దుంపను గుర్తించింది. ఇక పోగొట్టుకున్న తన ఉంగరం మళ్లీ తిరిగి దక్కడంతో సంతోషంతో మునిగిపోయింది మేరీ. ఐదు సంవత్సరాల క్రితం మరణించిన తన భర్తకు ఈ విషయం చెప్పాలనుకున్నానని.. కానీ అప్పటి పరిస్థితి బట్టి చెప్పలేకపోయానని బాధపడింది.